Song no: #43
శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను శ్రేయముల నెఱింగి నీకు రేయిపవ లొసంగి యెడఁ బాయని యంతరంగి యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ ||శ్రీ యేసు||
- నిదురయందు నేఁడు క్షేమ మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ మాయెఁజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||
- అంధకార మణఁగెన్ హృదయాంధకార మణఁగెన్ ప్రభు నందుఁ దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగఁ గూర్చి ||శ్రీ యేసు||
- కంటిపాప వలెను నిను గాయువాని దయను గనుఁ గొంటివి స్తోత్రమును జేయు మింటి కినిమంటికన్నింటికిని కర్తయని ||శ్రీ యేసు||
- కలకల ధ్వనిఁజేయు పక్కిగములు లయను గూయు సర్వములు ప్రభు స్తుతిఁజేయు నీ వలయక సొలయక వెలయఁగఁ బాడు ||శ్రీ యేసు||
- సేవయందు నీకు మంచి యీవు లిడుపరాకు గల భావముఁబడఁ బోకు నేడుఁ కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||
- పగటివార మంచు నిష్ఫ్లపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు పురికెగయ నీ దిగులు విడు తగు నమ్మకమున ||శ్రీ యేసు||
- మింటి నంటఁ బాడు నీ యొంటి బలిమి నేఁడు ప్రభు నంటి యుండ వాఁడు నిన్నొంటి నెన్నంటి కెన్నింటికిన్వీడఁడు ||శ్రీ యేసు||
Song no: #42
తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||దెల్లవారిన వేళ||
- నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ||
- భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్ ||దెల్లవారిన వేళ||
- దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
- పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
Song no: #41
మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున || మేలుకొనరే ||
- దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకుఁ గొలువసేయఁగ || మేలుకొనరే ||
- పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడఁగ || మేలుకొనరే ||
- నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక పదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింప మహాముదంబున || మేలుకొనరే ||
- మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు నేటుగా ధరియించుకొని యిటు నిర్మలాత్మునిఁ బూజసేయఁగ || మేలుకొనరే ||
- తెల్లవారఁగఁ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ మయ్యెను హృదయముల పై || మేలుకొనరే ||
Song no: #40
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు ప్రాతఃకాలస్తుతి నీకీ చెల్లింతుము శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!
- శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందుఁ బరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు శెరపుల్ ఖెరూబుల్ సాష్టంగపడి నిత్యుఁడవైన నిన్ నుతింతురు.
- శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ పాపి కన్ను చూడలేని మేఘ వాసివి అద్వితీయప్రభు, నీవు మాత్రమేను కరుణ, శక్తి, ప్రేమరూపివి.
- శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు సృష్టిజాలమంత నీ కీర్తిఁబాడును శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!
Song no: #39
- నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.
- కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.
- భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.
- విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.
- జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి కృపావిముక్తులందుఁడి సంపూర్ణ భక్తితో.
- అర్పించె యేసు ప్రాణమున్ నరాళిఁగావను; యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుఁడి.
- సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని సర్వత్ర దేవుఁడొందుగా సద్భక్త పాళిచే.
Song no: #38
కృపగల దేవుని సర్వదా నుతించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
- సర్వశక్తుఁడాయనే సర్వదా చాటించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును
- పగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
- సర్వజీవకోటిని బ్రోచు దేవుఁ డెన్నఁడు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
- కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
- దైవ ఘన మహిమన్ జాటుచుండుఁడి యిలన్ దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
Song no: #37
మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు ఆ పాత శత్రువెంతో క్రూరుఁడు తదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు.
- మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుఁడు యుద్దంబు చేసిపెట్టు అతం డెవ్వఁడు? యేసు క్రీస్తను మా రక్షకుండు మరొక్కఁ డెవ్వడు? అతండె గెల్పుపొందు
- ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు? మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భేతివేయు? ఈ లోకాధిపుఁడుగ్రుఁడైనను దానేమి చేయుఁ? దీర్పొందె నతఁడు నశించు మాటతోనే.
- వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేఁడు. దైవాత్మ తోడగుం గదా తా నిన్న నేఁడు రేపు. మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదె రాజ్యంబు మాది యౌను.