Mahathmudaina na prabhu vichithra silva juda మహాత్ముఁడైన నా ప్రభు విచిత్ర సిల్వఁ జూడ

Song no: 212

మహాత్ముఁడైన నా ప్రభు విచిత్ర సిల్వఁ జూడ నా యాస్తిన్ నష్టంబుగా నెంచి గర్వం బణంగఁ ద్రొక్కుదున్.

నీ సిల్వ గాక యో దేవా దేనిన్ బ్రేమింప నీయకు నన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును.

శిరంబు పాద హస్తముల్ నూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాదప్రేమ లీ గతిన్?

ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీట మేసు కుండినన్ ఈ భూకిరీటములన్నీ దానం దూగంగఁ జాలు నే?

లోకంబు నే నర్పించిన నయోగ్యమైన యీవి యౌ వింతైన యేసు ప్రేమకై నా యావజ్జీవ మిత్తును.

రక్షింపఁ బడ్డ లోకమా రక్షింపఁ జావుఁ బొందిన రక్షకుఁ డేసునిన్ సదా రావంబుతోడఁ గొల్వుమా





Silva yoddha jerudhun bidha hinayandhudan సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్

Song no: 211

సిల్వయొద్దఁ జేరుదున్ బీద హీనయంధుఁడన్ లోకమున్ త్యజింతును పూర్ణముక్తి నొందుదున్ ||కర్త, నిన్నె నమ్ముదున్ కల్వరీ గొఱ్ఱెపిల్లా మోకరించి వేఁడెదన్ నన్నుఁ గావుమో ప్రభో!||

నిన్ నేఁజేరఁ గోరఁగా నన్ను ఁబాయు పాపము శుద్ధిఁజేతునంచును యేసు మాటనిచ్చెను.

నన్ను ను నా మిత్రులన్ లోక యాస్తిఁ గాలమున్ దేహయాత్మయంతయు నీకర్పింతునిప్పుడు.

యేసుమాట నమ్మెదన్ క్రీస్తు రక్త పుణ్యముఁ జూచి మ్రొక్కి యేసుతో నేను మృతినొందితిన్.

యేసు తాను వచ్చును నాకు నిచ్చు పూర్ణతన్ శుద్ధ సౌఖ్య మొందుదున్ జయస్తోత్ర మేసుకు.

Gayambutho nimdaru o shuddha sirassa గాయంబుతో నిండారు ఓ శుద్ధ శిరస్సా

Song no: 210


గాయంబుతో నిండారు ఓ శుద్ధ శిరస్సా! హా! ముండ్ల కిరీటంబు భరించు శిరస్సా! నీకిప్పుడు డపకీర్తి హాస్యంబు గల్గెఁగా కర్తా! ఘనంబు కీర్తి ఎన్నడు గల్గుఁగా

లోకంబు భీతి నొందు ప్రకాశపూర్ణుడా! ఆ యూదులైన వారు నీ మొము మీఁదను! నాఁడుమ్మి వేసినారా? నీ ముఖకాంతికి సమాన కాంతి లేదు కురూపి వైతివా.

నీవోర్చినట్టి బాధ నా క్రూర పాపమే! నాకోస మింత బాధ వహించినావుగా! దైవోగ్ర బాధ కేను పాత్రుండ నైతిని దృష్టించి నన్నుఁ జూఁచి కటాక్ష ముంచుమీ.

నేఁ బాపి నైతి గాని నన్ నీవు చేర్చుము! నీ నిత్యయూటనుండి మేళ్లన్ని పారును! నీ నోరు మాధుర్యంపు సుబోధఁ జెప్పెను నీ పావనాత్మ మోక్ష సుఖంబు లిచ్చును.

నా కోస మింత బాధ వహించి నందుకు! యధార్థమైన స్తుతి నిత్యంబు నీదగున్ నీ నామమందు నేను విశ్వాస ముంతును నా యంత్యకాలమందు నా యొద్దనుండుము.


Naa koraku chanipoyi nada aadha yakarundiru నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు

Song no: 209

నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు వంక దొంగలతోడ ||నా కొఱకు||

ఆలకింపగను మనసార నాకు నానదే యా దయామృత సారధార భూలోకమునఁదనివిఁ దీర నిట్టి పుణ్యాత్ము నేమఱక పూజింతు మీర ||నా కొఱకు||

కన్న తలిదండ్రులకు నైన యింత ఘన వత్సలత నేఁ గల్గుటంగాన విన్నదియులేదు చెవులూన స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను ||నా కొఱకు||

కీటకమువంటి ననుఁ బ్రోవ సొంత కీలాలమర్పించి ఖేదపడిచావ వాటమా తన కిటులఁ గావ నేను వర్ణింపఁ గన్నీరు వరదలైపోవ ||నా కొఱకు||

ఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి కొంకకానిర్దయుల్ గొల్గొతా మనలను మారణంబగు నవస్థలను బెట్ట మాదృశాత్మన్గావ మౌనమైయిలను ||నా కొఱకు||

ఏమి బహుమతుల నర్పింతు నట్టి స్వామిమేళ్లల్ల నా స్వాంతమున నుంతున్ ప్రేమ భావమున వర్తింతున్ నిత్య కామితార్థం బిడు కర్తను భజింతున్ ||నా కొఱకు||

చేయనిఁక పాప సంగతము నాఁడు సిలువపైఁ జచ్చిన శ్రీకరుని కతము పాయ కాబ్రభుసత్యవ్రతము నాధు ప్రాణాంత మౌదాఁక ప్రార్థింతు సతము ||నా కొఱకు||


Harshame yentho harshame kreesthunu karyamu harshame హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే

Song no: 208

హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే యెంతో హర్షమే హర్షమే తద్భక్తవరులకు నద్భుతంబగు యేసు క్రియలా కర్షమై హృదయంబు నందలి కలుషముం ధ్వంసింపఁజేయు ||హర్షమే||

ఆర్యుఁడై భాసిల్లు మన ప్రభు నార్త ధ్వనితో జీవమీయఁగ సూర్యరశ్మి దొలంగి యిరలై క్షోణియును గంపంబు నొందుట ||హర్షమే||

మారణముఁ దానొందునయ్యెడ మంగళముగా మృతులనేకుల్ దారుణిం జీవించి మఱలను దామెరుసలేమందుఁ జొచ్చుట ||హర్షమే||

పొరిపొరిం గాసించు చొక త స్కరుఁడు వధ్యాస్తంభమున న నర్మువ కోస్వామియన న్బ్రభు కరుణతో మోక్షం బొసంగుట ||హర్షమే||

ఏలి కనువిడ సాలమోన్భూ పౌలు నా దేవాలయపు తెర జీలిపోవను రెండుగా జన జాల మాశ్చర్యమునఁ బొందుట ||హర్షమే||

సిలువపై యేసున్ శపించిన ఖలులకై దేవునిఁ బితాయని పిలిచి వీరింగావు మంచును బ్రేమతో జీవంబు విడుచుట ||హర్షమే||

నెయ్యమున విభుఁ డేసునాధుం డి య్యరులకై ప్రాణమీయఁగ వ్రయ్యలాయె ధరాధరంబులు నయ్యరాతులు భీతినొందుట ||హర్షమే||

కీటకముతో సాటి యగునా ఘాటమగు పెనుబాటులెల్ల మాటికిని దామీట నేనిఁక మేటి జీవకిరీట మొందుట ||హర్షమే||


Karunasagara vivekava maranamomdha కరుణసాగర వీవేకావా మరణమొంద

Song no: 206

కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా కరుణ సాగర వీవెకావ మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి నీ మరణరక్తము చేత నరులకు పరమరక్షణఁ దెల్పినావా ||కరుణ||

నజరేతు పుర విహారా నరులఁ బ్రోవ నరు దెంచినావా నజరేతు పురవిహారా ప్రజలపాపముఁ బరిహరించియు ప్రజల సద్గతి నొందఁ జేయను విజయమునుఁ బొందితివి యిలలో సజనులందరు భజనసేయఁ గ ||నజరేతు||

మరియయనే కన్యకుమారా నరకబాధఁ దప్పించినావా మరియయనే కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను మీరెగాకిఁక వేరేలేరని సారెసారెకుఁ జెప్పినావా ||మరియయనే||

మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా ||మహిలోను||

పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను ధరను మా పాపములుఁ గడుగను చిరముగా ను త్త రమునాయె ||పరమతండ్రి||

Yemi nerambuleka ya maranasthambhamu nela moya ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ

Song no: 205

ఏమి నేరంబులేక యా మరణస్తంభము నేల మోయ నాయెను నా యేసు ఎంత ఘోరము లాయెను ఈ మానవులు యెరుషలేము బైటకు దీయ నేమి నేరము దోచెను ||ఏమి||

మున్ను దీర్ఘదర్శు లెన్నిన రీతిని కన్నెకడుపున బుట్టిన నా యేసు వన్నె మీరంగ బెరిగిన చెన్నైన నీ మేను చెమట బుట్టంగ నీ కిన్ని కడగండ్లాయెను ||ఏమి||

కన్నతల్లి యిట్టి కడగండ్లు గాంచిన కడుపేరీతినోర్చును నా యేసు గాంచనేలను గూలును నిన్నెరిగి నట్టివారు నీ పాట్లు గని యేడ్చు చున్నారలీ వేళను ||ఏమి||

అయ్యయ్యో యూదు లింత నెయ్యంబు దప్పిదైన భయంబు విడిచి పూని నా యేసు మోయ శక్యంబు గాని కొయ్యమూపు నెత్తి రయ్య నీ కెంత భార మయ్య వెతజూడ జాలను ||ఏమి||

పిల్ల లాట్లాడినట్లు ముల్లులతో కిరీట మల్లి నెత్తిన గొట్టిరి నా యేసు పల్లరుపు లధికమాడిరి ఎల్లవారిలో నిన్ను ఎగతాళి గావించి మొగము మీ దెల్లనుమిసిరి ||ఏమి||

కొరడాలతో నిన్ను గొట్టి కండ్లకు గంత గట్టి చేజరిచి వేడ్కను నా యేసు అట్టి వారెవ్వరంచును విరగ భావంబునడిగి నెక్కిరించుచు నీ వెంబడి వత్తురేలను ||ఏమి||

ఏలడివారు నడువ మ్రోలవస్త్రంబులను నేల బరిచిన రీతిగా నా యేసు మ్రోలబరిచిరియట్లుగ ఏల యీ కోడిగంబు లేల నీమీద కంటు ఏమి నేరంబు లేదుగ ||ఏమి||

చాల బాధించి క పాల స్థలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను నా యేసు జాలి రవ్వంత లేకను కాలు సేతులినుప చీలలతో బిగించ జిమ్మి రక్తంబు గారెను ||ఏమి||

నాదేవ నా దేవ నన్నెందుకై విడిచి నా వంచు మొరబెడితివి నా యేసు నమ్మితివి లోబడితివి వేదనధికంబాయె నే దిక్కులేనట్టు యూదాళి కగుపడితివి ||ఏమి||

అంధకారము దేశ మంతట గలిగెను ఆవరించెను సూర్యుని నా యేసు ఆలయపు తెరచినిగెను బంధ స్తంభమునుండి బహు గొప్ప శబ్దముతో బిలిచెద వేమిట్లను ||ఏమి||

ఓ తండ్రి నీ చేతి కొప్పగించుచున్నాను ఒనరంగ నా యాత్మను నా యేసు అని ప్రాణమును వీడెను ఏ తప్పిదంబు లేక నీ పాటునొందితివి ఎంతో వింతై నిలుచును ||ఏమి||

నీ చాత్ము డొకడు నిఱ్ఱ నీల్గి బల్లెంబుతోడ నీ ప్రక్క బొడిచె చావను నా యేసు నీరు నెత్తురు గారెను ఏచియున్నట్టి కస్తి కెట్లు నీ యొడలుసైచె నెంతో చోద్యంబు చూడను ||ఏమి||

పాపాత్ములకు పూట బడిన వల్లనే యింత పరితాపమరణమాయెను నా యేసు ఎరిగే యనుభవించెను నా పాప ఫలము నిన్ను వేపాట్లు బెట్టి చంప నోపితివయ్య ప్రేమను ||ఏమి||

ఎంత యమూల్యమైన దెంతయనంతమైన దెంతయగాధమైనది నా యేసు ఎంతో యుచితమైనది ఎంతో వింతైన ప్రేమ ఏహ్యులమైన మాకు ఏల కనుపర్చబడ్డది ||ఏమి||

ప్రేమాతిశయుడనేను ఏ మాత్రుడను నెన్న నా మానసమున కందను నా యేసు ప్రేమ సారంబు తెలియను పామరాళిని బ్రోచు క్షేమాధికారి నిన్ను యేమంచు వర్ణింతును ||ఏమి||